ఆంధ్ర దేశం తగలబడి పోతుంది. తెలుగు గడ్డ మీద, సాటి తెలుగువారి మధ్య బతకడం కోసం కొన్ని చిన్ని,చిన్ని త్యాగాలు (ఉద్యోగపరంగా) చేసిన నాలాంటి వాడికి ఇది చాలా బాధ కలిగించే విషయం. అవును నేను మాట్లాడుతుంది తెలంగాణా ఉద్యమం గురించి. నా ఉద్దెశంలో డిసెంబర్ 9, 2009 తర్వాత జరుగుతున్నవన్నీ చాలా అసహజ పరిణామాలు.
అందులో మొదటిది – ఆ అర్ధ రాత్రి ప్రకటన తరువాత అప్పటి వరకూ సమైక్యవాదులుగానో, తటస్థ వాదులుగానో, డొంకతిరుగుడు వాదులుగానో ఉన్నవారితొ సహా అందరు తెలంగాణా నాయకులూ పఖ్ఖా తెలంగాణా వాదులుగా మారిపోవడం. అంతేకాదు, ముందొచ్చిన చెవులకంటే వెనకొచ్చిన కొమ్ముల్లాగా ఈ నయాతెలంగాణా వాదులు పోటీలు పడి తమ వాడి చూపించడం మొదలు పెట్టారు – “ఆంధ్రోల్లని” దూషించటంలో, యువతని రెచ్చగొట్టటంలో. శ్రీ క్రిష్ణ కమిటీ పేరుతో కాలక్షేపం చెసిన సమయాన్నంతా పాత మరియు కొత్త తెలంగాణా వాదులు బాగా ఉపయోగించుకున్నారు – తెలంగాణా వాదాన్ని పల్లె పల్లెల్లోకీ తీసుకువెళ్లటానికి (తెలంగాణా వస్తే ఏర్పడే ఉద్యోగ,వ్యవసాయ అవకాశాల గురించి అభూత కల్పనలతో). దీని పర్యవసానమే తోటి తెలుగు వారి (ఆంధ్రోల్ల)పట్ల ఎక్కువమంది తెలంగాణావారిలో ఏర్పడిన ద్వేషం.
రెండవది – డిసెంబర్ 2009 తరువాత సీమాంధ్రలో ఉప్పొంగిన “సమైక్యాంధ్ర” ఉద్యమం. డిసెంబర్ 10 న జరిగిన మూకుమ్మడి రాజీనామాలు గానీ, భారీ రాస్తా రోకో లు గానీ ఆత్మప్రభోదం తోనో, స్వచ్చ్హందంగానో జరిగాయని నేను నమ్మను. తెలంగాణా విడిపోతే తమ ప్రాంతానిగ్గానీ, తమ కుటుంబానిగ్గానీ ఏ రకంగా లాభమో,నష్టమో నిమిషాలమీద అర్ధంచేసుకునేంత తెలివి తేటలు సీమాంధ్రులకే కాదు ప్రపంచంలో ఏ ప్రాంత ప్రజలకీ ఉండవు. కానీ అలా లాభనష్టాలు బేరీజు వేసుకునే బుద్ధి మాత్రం రాజకీయ నాయకులకు ఉంటుంది కాబట్టే (ఈ విషయంలో కూడా ప్రపంచంలో ఏ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులైనా ఒక్కటే), నాకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులే చేయించి వుంటారని నమ్మకం. కాకపోతే తెలంగాణా వాదులూ ప్రజలూ ఇక్కడ అర్ధం చెసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు సీమాంధ్రలో కూడా ఉద్యమం ప్రజల చెతుల్లోకి వెళ్లిపోయింది (తెలంగాణా ఉద్యమ పరిభాషలో చెప్పాలంటే). మొదట్లో గుంపులో గోవిందా లాగా పాల్గొన్నా, పోను పోనూ పాతా కొత్తా తెలంగాణా వాదుల తిట్లకీ, ప్రతి దాంట్లొనూ “ఆంధ్రొళ్ల” కుట్రను చూసే వక్ర భాష్యాలకీ సీమాంధ్ర ప్రజల్లొ ఇప్పుడు పీకల్దాకా ఉంది “తెలంగాణా వాదం” మీద. ఈ విషయం తెలంగాణా ప్రజలూ నాయకులూ ఎంత తొందరగా అర్ధం చేసుకుంటే అంత మంచిది.
ఇరు ప్రాంతాల ప్రజలను బద్ద శత్రువులుగా చేసిన ఘనత మాత్రం కాంగ్రెస్స్ అధినాయకత్వానికే దక్కుతుంది. వాళ్లు ఏ లక్ష్యంతొ మొదలుపెట్టారో గానీ, ఏదీ సవ్యంగా చేయలేదు. వాళ్ల ఉద్దెశం తెలంగాణాను విడతీసి చంద్రబాబునీ, జగన్నీ దెబ్బతీయాలనుంటే వాళ్లు చేసుండాల్సింది సుహ్రుద్భావ వాతావరణంలో చర్చలు జరిపి చటుక్కున పని కానివ్వడం.ఇటు పక్క కాంగ్రెస్, తెరాస వాళ్లూ అటు పక్క కాంగ్రెస్ వాళ్లూ ఈ పనికి సహకరించేవాళ్లు. ఒక వెళ తెదేపా (చంద్ర బాబు) అడ్డుపడటానికి ప్రయత్నించినా అందరి ముందూ వారి “తెలంగాణా వైఖరిని” ప్రశ్నించి వారిని ఇరుకున పెట్టటం, అవసరమైతే ఆ పార్టీ లోని తెలంగాణా వాళ్లని పక్కకి లాగటం అంత కష్టమేమీ కాదు. న్యాయంగా కూడా అవతలివారిని సంత్రుప్తిపరిచి, ఆనక తెలంగాణాను ఏర్పాటును చేయటం పద్ధతిగా ఉండెది. కానీ ఈ కాంగ్రెస్ అధిష్టానం చేసిందెమిటి? ఇవతలి ప్రాంతపు ప్రజల, ముఖ్యంగా రాజకీయ నాయకుల భవిష్యత్ గురించి ఏ మాటా చెప్పకుండా హఠాత్తుగా తెలంగాణా ప్రకటించేసారు. అన్నేళ్లపాటు తెలంగాణా వాదం పై దుమ్మెత్తిపొసిన లగడపాటి జనాలకి తన మొహం ఎలా చూపించగలడు? కనీసం వచ్చె ఎన్నికల్లోనైనా అంధ్రప్రదెశ్ కి ముఖ్యమంత్రి అవుతానని కలలు కంటున్న చంద్రబాబు ని కేవలం రాయలసీమకే పరిమితమవ్వటమంటే ఎలా ఊరుకుంటాడు? (విభజన మొదలైతె కనీసం మూడు ముక్కలౌతుంది ఆంధ్రప్రదెశ్, రాజకీయ నాయకుల అవసరాల కోసం). అలాగే ప్రతీ పెద్దనాయకుడికీ, ప్రతీ చిరంజీవికీ కొన్ని ఆశలూ కొన్ని భయాలూ ఉంటాయి రాష్ట్ర విభజన విషయంలో. వారెవరికీ భరొసా కల్పించకుండా, తమ ప్రజల దగ్గరికి పొయి “మేము ఇది సాధించి అప్పుడు తెలంగాణా కి ఒప్పుకున్నాం” అని చెప్పుకోటానికి ఏమీ అందించకుండా అదరాబదరా గా చేసేసారు. నేను ముందు చెప్పినట్టు, ఆంధ్రా రాజకీయ నాయకులందరికీ తమ రాజకీయ భవిష్యత్ దెబ్బతినే సూచనలు కనపడగానే వారి పవరెంటో చూపించారు.
ఈ కాంగ్రెస్ వారి నిర్వాకం వల్ల జరిగిందేమిటి? తమ నోటికాడ కూడు లాగేసారని తెలంగాణా వారూ, తమని మోసగాళ్ల లాగా దోపిడీదారుల్లాగా జమకడుతున్నారని సీమాంధ్రులూ ఒకళ్లమీద ఒకళ్లు కత్తులు నూరుతున్నారు. 3 వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక జాతి ఇలా దిగజారిపోతున్నందుకూ, దేశప్రజలందరి ముందూ నవ్వులపాలు అవుతున్నందుకూ చాలా బాధగా ఉంది.
తెలంగాణా వాదం మీదా, ప్రస్తుత సమస్యకి ముగింపు ఎలా ఉండబోతుంది అనే విషయం మీదా నా అభిప్రాయాలు నా తరువాతి పోష్టుల్లొ వివరిస్తాను.
ఇందులో కేవలం కాంగ్రెస్ తప్పిదాలు మాత్రమే కాదు అన్ని రాజకీయ పక్షాల తప్పిదమూ ఉంది. ఎవరికివారు తమ ప్రయోజనాలే ముఖ్య్దం అనుకుంటూండటంవల్ల వచ్చిన పరిస్థితి ఇది.
ప్రస్తుత పరిస్థితిలో తెలంగాణ ఏర్పాటు చేయటం అంటే ఆంధ్రుల సహనాన్ని పరీక్షంచినట్లే అవుతుంది. దేశ సమగ్రతకు అదెంతమాత్రం మంచిది కాదు.
అచంగ, మాంఛెస్టర్
అచంగ గారూ మీరు గమనించినట్లులేరు. నేను రెండవ మరియు మూడవ పేరాలలో ఇరు ప్రాంతాల రాజకీయ నాయకులను తప్పు పట్టాను, కానీ అగ్ర తాంబూలం మాత్రం కాంగ్రెస్ అధిష్టానానిదే నా ఉద్దెశంలో.
నాగ్ గారూ,
నేను రాజకీయ పక్షాలను గురించి మాట్లాడాను. ప్రాంతాల గురించి కాదు. ఒక్కసారి నా వ్యాఖ్య చూడగలరు